Saturday, 12 March 2011

బియ్యెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..



ఇలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలిలో పిలవడానికి కారణమేంటంటే.. కుసింత జాగర్తగా ఈ టపా చదివి ఇందులో చెప్పిన సూచన పాటించాలని.

నేను బియ్యెస్సెన్నెల్లు వారి బ్రాడ్ బ్యాండు వాడుతున్నాను. పని చేసినన్నాళ్ళూ అది చక్కగా పని చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే మాత్రం నానా తిప్పలూ పడాలి దాన్ని బాగు చేయించుకొనేందుకు. అదృష్టవశాత్తూ నాకు ఈమధ్య కాలంలో సమస్యలేమీ రాలేదు. అంచేత నేను బియ్యెస్సెన్నెల్లు వారిని పిలవనూ లేదు.

ఈవిధంగా హాయిగా జీవిస్తూండగా రాత్రి కంప్యూటరు మొదలెట్టగానే, http://www.motive.bsnl.co.in/ అనే సైటు తెరుచుకుంది. మీ మోడెమును చక్కగా పనిచేయించేందుకు, సమస్య వచ్చినపుడు బియ్యెస్సెన్నెల్లు వాడిచేత రిమోటుగా రిపేరు చేయించుకొనేందుకు, ఇదిగో ఈ లింకు నొక్కి, సాఫ్టువేరును దించుకోండి అని ఉంది. చక్కగా బియ్యెస్సెన్నెల్లు వాడి సైటులాగానే ఉందా పేజీ. ఓహో మన బియ్యెస్సెన్నెల్లేగదా అని ఆత్రంగా వాడిచ్చిన డౌనులోడు లింకును నొక్కి motiveactivation.zip అనే, చిన్నాచితకా కాదు, 138 ఎంబీల ఫైలును దించుకున్నాను. అయితే, వెంటనే నా యాంటీవైరసు తెరమీదకు దూసుకొచ్చింది.. ఇందులో Click2kUns.exe అనే వైరసుంది అంటూ! వెంటనే ఆ ఇన్‍స్టాలును ఆపుజేసేసాను. జాలంలో Click2kUns.exe కోసం వెతికితే నాలాంటి ఆత్రగాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసింది.

అంచేత మీరు గ్రహించాల్సింది ఏంటంటే.. మీరూ నాలాగా ఆత్రపడకండి, ఆ ఫైలును డౌనులోడు చేసుకోకండి. అది బియ్యెస్సెన్నెల్లు పేరుతో ఎవడో వైరసుగాడు పంపిస్తున్నట్టున్నాడు. దీని గురించి మరింతగా తెలిసినవాళ్ళుంటే చెప్పగలరు. మరిన్ని వివరాలు తెలిసేదాకా దాని జోలికి వెళ్ళకపోతే మంచిది.

No comments:

Post a Comment